తెలంగాణ వార్త: దేశంలో ద్విచక్ర వాహనదారుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ రవాణాపై ఆధారపడటం కష్టం కాబట్టి ఎక్కువగా ప్రజలు సొంత వాహనాల వైపే మొగ్గు చూపుతారు. అందుకే ద్విచక్ర వాహనం లేకుండా రోజు గడవడమనేది చాలా కష్టమైనదని మనకు తెలిసిందే. అంతగా మన జీవితాల్లో భాగమైపోయింది.: ఈ క్రమంలో తమ చిన్న చిన్న అవసరాల కోసం కొత్త బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు చాలా తక్కువ. తమ బడ్జెట్‌లో మంచి కండిషన్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ టూ వీలర్ కొంటే సరిపోతుందని అనుకుంటారు. అయితే ఇక్కడ సెకండ్ హ్యాండ్‌లో ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన తర్వాత దానిని కొత్త యజమాని పేరు మీద బదిలీ చేయడం కూడా చాలా కీలకం.
వాహన యాజమాన్యాన్ని ఒక వ్యక్తి నుంచి మరొకరికి బదిలీ చేయడం అనేది చాలా శ్రమ, పత్రాలతో కూడిన ప్రక్రియ. కానీ దేశం ఇప్పుడు డిజిటలైజేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో ప్రతి పనీ సులభంగా అయిపోతుంది. ఎటువంటి పేపర్లు లేకుండా కంప్యూటర్ ద్వారా అన్ని పనులు జరిగిపోతున్నాయి. ప్రస్తుతం వాహన యాజమాన్యాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. అందుకోసం ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకోండి.
వాహన యాజమాన్య బదిలీ కోసం కొన్ని సర్టిఫికెట్స్ చాలా అవసరం. ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ (PUC), ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ (ఇన్సూరెన్స్), ఫారం 29 మరియు ఫారం 30 వంటి పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. వాటిని సరిగా నింపి వాహన విక్రేత మరియు కొనుగోలుదారు సంతకం చేయాలి. తర్వాత వాటన్నింటినీ స్కాన్ చేసి దగ్గర ఉంచుకోవాలి.
వాహన్ సేవా(Vahan seva) పోర్టల్‌ని సందర్శించి మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఛాసిస్ నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత అందులోని “ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్(Transfer Of Ownership)” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంను ఫిల్ చేసేందుకు మిమ్మల్ని సంబంధిత పేజీకి తీసుకెళుతుంది.
ముందుగా మీ వద్ద ఉన్న సంబంధిత పత్రాల స్కాన్ కాపీలను ఆ పేజీలో అప్‌లోడ్ చేయాలి. అందుకోసం మీరు అక్కడ కనిపించే “Upload Document” బటన్‌ను క్లిక్ చేసి డాక్యుమెంట్స్ స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయవచ్చు. ఆ తర్వాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు.
మీరు దరఖాస్తు ఫారమ్‌ను నింపిన తర్వాత, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేశాక, “submit” బటన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు RTO మీ దరఖాస్తును ప్రాసెస్ చేస్తుంది. కొనుగోలుదారు పేరు మీద కొత్త RCని జారీ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో RCని యజమాని ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మీరు RTO కార్యాలయానికి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది
Leave a comment