(తెలంగాణ వార్త) యువతకు ఉచిత పోలీస్ శిక్షణకై వెబ్ సైట్
బాల్కొండ సెగ్మెంట్ యువత కోసం సొంత ఖర్చుతో ప్రత్యేక యాప్ ఏర్పాటు
నిజామాబాద్, మార్చి 20 : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చొరవ చూపిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భర్తీ చేయనున్న 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలలో 95 శాతం కొలువులు స్థానికులకే దక్కనున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గడిచిన ఏడు సంవత్సరాలలో లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. తాజాగా మరో 80వేల ఉద్యోగ నియామకాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ వెలువరించనుందని తెలిపారు. స్థానికులకే కొలువులు దక్కాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా కృషి చేశారని అన్నారు. దీనివల్ల నిజామాబాద్ జిల్లాలోనూ 1978 ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని మంత్రి పేర్కొన్నారు. పోలీస్ శాఖ లోనే వెయ్యి కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారని వివరించారు. ఆసక్తి, అర్హత కలిగిన యువతీ యువకులకు పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందేలా దాతల సహకారంతో ఉచిత శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను ప్రత్యేకంగా రూపొందించామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ యువత కోసం తన సొంత ఖర్చుతో ప్రత్యేకంగా యాప్ ను అందుబాటులోకి తెస్తున్నానని, ఆయా ఉద్యోగాల కోసం అర్హత కలిగిన యువతకు వీడియోల ద్వారా మెరుగైన శిక్షణ అందుతుందని, తద్వారా అత్యధిక మంది ఉద్యోగాలు పొందేందుకు ఆస్కారం వుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయిస్తోందని చెప్పారు.
ఉద్యోగాల కల్పన, సంక్షేమాభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్
కాగా, ఉద్యోగాల కల్పనతో పాటు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా, నియామకాలు చేపట్టనున్న ఉద్యోగాలను కలుపుకుని కేవలం ఏడేళ్ళ వ్యవధిలోనే తమ ప్రభుత్వం రెండు లక్షల 10వేల ఖాళీలను భర్తీ చేస్తోందని వివరించారు. దేశవ్యాప్తంగా చూసినా, మరే ఇతర రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ జరగలేదని అన్నారు. తెలంగాణతో పోలిస్తే నాలుగింతలు పెద్దదిగా ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ జరగలేదని అన్నారు. తాను చెప్పినది తప్పు అని ఎవరైనా నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనని సవాల్ విసిరారు.
మంత్రి కే.తారక రామారావు నైపుణ్యం వల్ల రాష్ట్రంలో కొత్తగా 17 వేల పరిశ్రమలు నెలకొల్పబడ్డాయని తెలిపారు. తద్వారా ప్రైవేటు రంగంలోనూ తెలంగాణలో 16 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఐటీ రంగంలో ఇదివరకు మూడు లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య ఆరు లక్షలకు పెరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వాస్తవాలను ప్రజలు గుర్తెరిగి సుపరిపాలనకు పాటుపడుతున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు.
ఉద్యోగాల కల్పన విషయంలోనే కాకుండా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని, రైతు బీమా, రైతుబంధు పథకాలతో అన్నదాతలను ఆదుకుంటున్నామని, ప్రాజెక్టుల నిర్మాణాలతో పంటలకు సాగు నీటి కష్టాలను దూరం చేశామని, ఆయా వర్గాల వారికి పెద్ద ఎత్తున ఆసరా పెన్షన్ లను అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రామ గ్రామాన అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి రావాలనే సదాశయంతో ప్రతి పల్లెలో వైకుంఠ ధామాలు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, నర్సరీలు, బిటి రోడ్ల నిర్మాణాలతో పాటు అన్ని కులాల వారికి కుల సంఘ భవనాల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నామని వివరించారు. కుల వృత్తుల వారిని ఆదుకునేందుకు చేపడుతున్న కార్యక్రమాల వల్ల వారి ఆర్థిక స్థితిగతులలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. మసీదులు, మందిరాల నిర్వహణాభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తోందని తెలిపారు ఇవన్నీ కళ్ళముందు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నప్పటికీ, కొంతమంది పనిగట్టుకుని అసత్య ప్రచారాలతో రాష్ట్ర ప్రభుత్వంపై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే గడిచిన 50 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు, తమ ప్రభుత్వ హయాంలో ఏడేళ్ల కాలంలో పది రెట్లు ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి, అనుక్షణం ప్రగతి కోసం పరితపిస్తున్న తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంత్రి వెంట ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Leave a comment