ప్రముఖ దర్శకుడు. వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి పైన అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవటంతో చెన్నై జార్జి టౌన్ కోర్టు వారెంట్ ఇచ్చింది.
సెల్వమణి దక్షిణ భారత చలన చిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడిగానూ ఉన్నారు. 2016లో సెల్వమణి..కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రా గురించి తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు.
దీంతో..బోద్రా జార్జి టౌన్ కోర్టులో సెల్వమణితో పాటుగా అరుళ్ అన్భరసు పైన పరువు నష్టం దావా వేశారు. బోద్రా మరణించాక.. ఆయన కుమారుడు గగన్ బోద్రా ఈ కేసు కొనసాగిస్తున్నారు. ఈ కేసు కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. కాగా, సెల్వమణితో పాటుగా అరుళ్ అన్భరసు కోర్టు ముందు హాజరు కాలేదు. వారి తరపున న్యాయవాదులు సైతం రాలేదు. దీంతో..న్యాయమూర్తి వారిద్దరి పైనా అరెస్ట్ వారెంట్ జారీ చేసారు.
కేసు తదుపరి విచారణ ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసారు. 2016 సెప్టెంబర్ 5న టీవీ ఛానల్ చర్చలో వారిరువురు వ్యాఖ్యలు చేయగా..2017 లో కేసు దాఖలైంది. వారిద్దరూ చేసిన వ్యాఖ్యలతో సాధారణ ప్రజల్లో తన పరవుకు భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని పిటీషనర్ పేర్కొన్నారు. దీంతో.. కోర్టు తాజా వారెంట్ తో సెల్వమణి.. అన్భరసు ఇప్పుడు ఈ వారెంట్ రీకాల్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.
Leave a comment