(తెలంగాణ వార్త) ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం స్వచ్ఛత, ఐక్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛత, ఐక్యత కోసం ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ ప్రారంభించారు. ఇందులో భాగంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు చీపుర్లు పట్టుకొని ప్రధాన రోడ్డుపై చెత్తను ఊడ్చారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తాచెదారాన్ని తొలగించారు. మురుగు కాలువలలో నీటి ప్రవాహానికి అడ్డంకిగా నిలిచిన రాళ్లను, ప్లాస్టిక్ కాగితాలను, వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేశారు. మురుగు కాలువలలో ప్లాస్టిక్ కాగితాలు, వ్యర్థాలు వేయొద్దని, రోడ్లపైకి మురుగు నీరు రాకుండా చూడాలని, పరిసరాలను చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ పట్టణంలోని కాలనీని స్వచ్చంగా, సమైక్యంగా ఉంచాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రతి ఆదివారం కాలనీ వాసులమంతా కలిసి రెండు గంటలు శ్రమదానం చేసి, పరిసరాలను శుభ్రం చేస్తామని, స్వచ్ఛత, ఐక్యత, అభివృద్ధిలో జర్నలిస్టు కాలనీని ఆదర్శంగా నిలుపుతామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్, కోశాధికారి ఆర్.సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, సుంకె శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి కొంతం రాజు, ప్రచార కార్యదర్శి చిలివేరి రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు రాగి నర్సయ్య, అబ్దుల్ ఆవేజ్, కాలనీవాసులు ఎల్టీ.కుమార్, భూమయ్య, దినేష్, రవి, గణపతి, మోహన్, గంగాధర్, నారాగౌడ్, ప్రవీణ్, భాజన్నపాల్గొన్నారు.
Leave a comment