-సీఎంవో ఓఎస్ డీ ప్రియాంక వర్గీస్ వెల్లడి
-పార్కు సందర్శన.. పనుల పరిశీలన
-పార్కు విశిష్టతను వివరించిన పీయూసీ ఛైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి.
ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని సీఎంఓ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రియాంక వర్గీస్ హామీ ఇచ్చారు. పనులను వేగవంతం చేసివచ్చే ఏప్రిల్ నెలల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సహకరిస్తామని ఆమె పేర్కొన్నారు. ఆమె గురువారం ఆర్మూర్ అర్బన్ పార్కు ను సందర్శించారు. పీయూసీ ఛైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అర్బన్ పార్క్ వద్దకు చేరుకున్న ప్రియాంక వర్గీస్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె వారితో కలిసి పార్క్ మొత్తం కలియ తిరుగుతూ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడి పార్క్ నిర్మాణం పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్క్ నిర్మాణం లో భాగంగా శాఖల వారీగా చేపట్టిన పనుల పురోగతిని అధికారులు ఆమెకు వివరించారు. వాకింగ్ ట్రాక్, పార్కు చుట్టూ మూడు కిలోమీటర్ల పొడవునా నిర్మించిన పెన్షింగ్, పార్క్ ప్రాంతంలో ఉన్న శంభుని గుడి, సమీపంలో ఉన్న చెరువును, పార్కు లో వివిధ రకాల పనులు చేపట్టనున్న ప్రాంతాలను ప్రియాంక వర్గీస్ పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఆర్మూర్ అర్బన్ పార్కు విశిష్టత గురించి ఆమెకు వివరించారు. అటవీశాఖ పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతున్న ఈ ఆర్మూర్ అర్బన్ పార్కు పూర్తి అయిన తరువాత ఇది మన తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా మారుతుంది మేడం అంటూ పార్కు విశేషాలను ఆమె దృష్టికి తెచ్చారు. 166 హెక్టార్లు అనగా మొత్తం 470 ఎకరాల్లో చేపట్టిన ఈ పార్క్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవాలన్నది తమ అభిమతమని జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రమైన నిజామాబాద్-ఆర్మూర్ లను దాదాపు కలుపుతూ చిన్నపూర్,అడవి మామిడిపల్లి మధ్య నిర్మిస్తున్న ఆర్మూర్ అర్బన్ పార్క్ లో 5.6 కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్ ను నిర్మిస్తున్నామని, ఇప్పటికే మూడు కిలో మీటర్ల వరకూ గ్రీన్ పెన్షింగ్ వేయడం పూర్తయిందని, మిగిలిన 2.6 కిలో మీటర్లకు పెన్షింగ్ వేయడానికి అవసరమైన నిధుల కోసం ఎదురుచూస్తున్నామని జీవన్ రెడ్డి ప్రియాంక వర్గీస్ దృష్టికి తెచ్చారు. ఈ పార్కులో రెండు ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తున్నామని, ఇవి ఏక కాలంలో 500 మంది జిమ్ చేసుకునే సామర్థ్యం లు కలిగి ఉంటాయని ఆయన తెలిపారు. పార్క్ కు మంచినీటి సౌకర్యం కలిపించాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం పార్కు లో మిషన్ భగీరథ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించాలని ఈఎన్ సీని కోరామని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అయితే తప్పకుండా పార్కు కు మిషన్ భగీరథ నీటి కనెక్షన్ ఇస్తామని ఈఎన్ సీ చెప్పారన్నారు. విద్యుత్ లైన్ వేయాలని ఆ శాఖాధికారులను కోరామని, కల్వర్టుల నిర్మాణం పూర్తి కావచ్చిందని జీవన్ రెడ్డి వివరించారు. పార్కు సమీపంలో ఉన్న చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని, చెరువులో బోటింగ్ చేసే సౌకర్యం కలిపిస్తే ఈ ప్రాంతం మంచి పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ పార్కు లో గజేబో,ఓపెన్ క్లాస్ రూమ్, పురుషులు, మహిళలకు వేర్వేరు గా వాష్ రూముల నిర్మాణం5.6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ పొడవునా 46 బెంచిలతో సిట్టింగ్ ఆరెంజ్ మెంట్, 300ఎకరాల అటవీ విస్తీర్ణం స్పష్టంగా కనిపించేలా ఎతైన గుట్టపై 30ఫీట్ల ఎత్తులో వాచ్ టవర్ ను నెలకొల్పడం వంటి అంశాలను జీవన్ రెడ్డి ప్రియాంక వర్గీస్ కు వివరించారు. అద్భుతమైన ఈ ఆర్మూర్ అర్బన్ పార్కు తమకెంతో ప్రతిష్టాత్మకమన్నారు. పార్క్ విశిష్టతను స్వయంగా చూసిన మీరు సీఎం కేసీఆర్ కు వివరించి తమకు సహాకారం అందించాలని జీవన్ రెడ్డి ఆమెను కోరారు. ఆయన చెప్పిందంతా విన్న ప్రియాంక వర్గీస్ సానుకూలంగా స్పందించారు.సీఎం కేసీఆర్ తో మాట్లాడి వచ్చే ఏప్రిల్ నెలలోగా ఆర్మూర్ అర్బన్ పార్కు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటామని ప్రియాంక వర్గీస్ హామీ ఇచ్చారు.
Leave a comment