నిజామాబాద్( తెలంగాణ వార్త) మార్చి1 1: దళిత బంధు పథకాన్ని లబ్దిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని తమ కుటుంబ స్థితిగతులను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. అట్టడుగున ఉన్న తమ వంశాన్ని ఉన్నత స్థితికి చేర్చాలనే కసితో కష్టపడి పని చేస్తే తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధించగల్గుతారని అన్నారు. తద్వారా ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ప్రభుత్వ అభిమతం నెరవేరుతుందని, దళితబంధు పథకానికి సార్థకత చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపిక చేసుకున్న వ్యాపారంపై పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకుని ప్రణాళికాబద్ధంగా పని చేస్తే ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చని హితవు పలికారు.
మోర్తాడ్ మండలం దొన్ పాల్ గ్రామంలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్దిదారులను కలెక్టర్ గురువారం వారి ఇళ్ళకు వెళ్లి కలిశారు. ఏ యూనిట్లను ఎంపిక చేసుకున్నారు, ఏ రంగంలో అనుభవం కలిగి ఉన్నారు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. భాస్కర్ అనే లబ్దిదారుడు డ్రోన్ స్ప్రేయర్ ద్వారా వ్యవసాయ పంటలకు పిచికారీ మందు చల్లే యూనిట్ ను ఎంపిక చేసుకోగా, కలెక్టర్ ప్రయోగాత్మకంగా దాని పని తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, సేద్యపు రంగానికి ఎంతగానో ఉపకరించే యూనిట్ ను ఎంపిక చేసుకోవడం పట్ల భాస్కర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం బాల్కొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో దళిత బంధు కింద ఎంపికైన లబ్దిదారులతో కలెక్టర్ మోర్తాడ్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో సమావేశమై అవగాహన కల్పించారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం గ్రాంట్ రూపంలో దళితబంధు కింద పెద్ద మొత్తంలో అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దశల వారీగా అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారని, తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 17,700కోట్ల రూపాయలను దీనికోసం కేటాయించిందని గుర్తు చేశారు. ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఎంతో ప్రణాళికాబద్ధంగా వెచ్చిస్తూ వ్యాపార రంగంలో నిలదొక్కుకుని మంచి లాభాలు పొందాలని సూచించారు. కేవలం పెట్టుబడి పెడితే సరిపోదని, అంకిత భావంతో పనిచేస్తేనే విజయవంతం అవుతారని, లేనిపక్షంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా పలువురు వ్యాపారుల సాధకబాధకాలతో కూడిన ఉదంతాలను ప్రస్తావించారు. మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిఉన్న వ్యాపారాలను ఎంచుకుని పూర్తి అవగాహనతో ముందుకెళ్తే తప్పనిసరిగా లాభాలు పొందవచ్చని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సువర్ణావకాశంగా మల్చుకుని తమ రాబోయే తరాలకు కూడా సుస్థిర భవిష్యత్తును అందించాలని కలెక్టర్ ఉద్బోధించారు. సాధారణంగా ఏ వ్యాపారమైనా సొంతంగా నిర్వహిస్తేనే నిలదొక్కుకునేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. లబ్ధిదారులు తమకు అనువైన వ్యాపారాన్ని ఎంపిక చేసుకుని, దానిని ఏ ప్రాంతంలోనైనా నిర్వహించుకునే స్వేచ్ఛ ఉందని, ఎటొచ్చి తొందరపాటు నిర్ణయాలతో నష్టపోకూడదని హితవు పలికారు. లబ్ధిదారులు కోరితే వారికి మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిఉన్న పలు వ్యాపారాల గురించి తెలియజేస్తూ, ప్రభుత్వపరంగా అవసరమైన శిక్షణ అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులు ఆదరాబాదరాగా కాకుండా అన్ని అంశాలను ఆకళింపు చేసుకుని, పూర్తి అవగాహనను ఏర్పర్చుకున్న తరువాతే వ్యాపారాల స్థాపనకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఈ నెలాఖరులోపు యూనిట్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే ఏప్రిల్ మాసం మొదటి వారం నుండి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.
కాగా, క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం మోర్తాడ్ మండలం దొన్ పాల్ గ్రామంలో బస చేసి ఉన్న ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారుల బృందాన్ని కలెక్టర్ తన పర్యటన సందర్భంగా కలిశారు. గ్రామంలో ఇప్పటివరకు ఏయే పథకాలు, ఎలాంటి కార్యక్రమాలను పరిశీలించారు, వాటి అమలుతీరు ఎలా అనిపించిందని ఆరా తీశారు. వ్యవసాయరంగాన్ని, రైతు బీమా, రైతు బంధు, ధరణి పోర్టల్, మన ఊరు – మన బడి, ఉపాధి హామీ పథకం పనులు తదితర వాటిని పరిశీలించాలని సూచించారు.
కలెక్టర్ వెంట డీసీవో సింహాచలం, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి రమేష్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్ దాస్, ఫిషరీస్ ఏ.డి ఆంజనేయ ప్రసాద్, ఆర్మూర్ ఆర్దీవో శ్రీనివాస్, మోర్తాడ్ ఎంపిపి శివలింగు శ్రీనివాస్, సర్పంచ్ శివన్నోళ్ల వైష్ణవి, దొన్ పాల్ సర్పంచ్ పర్సు దేవన్న తదితరులు ఉన్నారు.
Leave a comment