-దర్యాప్తు సంస్థల తో దాడులు సిగ్గుచేటు
-ఢిల్లీ లిక్కర్ స్కాముతో కవితకు సంబంధం లేదు
-ఆమెపై నిరాధార నిందలు
-కవిత పోరాటాల వనిత
-కేసీఆర్ ను దేశ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునే కుట్రలు
-దీనిలో భాగంగానే కవితను టార్గెట్ చేశారు
-కేసీఆర్ ది ఫైటర్స్ ఫ్యామిలీ
-కవిత పై బీజేపీ రౌడీయిజం
-మోడీ ఈడీయిజం, షా ఐటీయిజం నడవదు
-ఈడీ, ఐటీ, సీబీఐ లు మోడీ చేతిలో కీలుబొమ్మలు
-అంబానీ, ఆదానీల చేతిలో మోడీ,షా లు తోలుబొమ్మలు
-బీజేపీ కండువా కప్పుకుంటే కేసులుండవా?
-ఈడీ ఐటీ, సీబీఐ లు బీజేపీ చేరికల కమిటీ సభ్యులు
-బీజేపీలోకి జంపింగ్ లు జనం కోసం కాదు ధనం కోసం
-కేసీఆర్ అంటే పవర్..ముట్టుకుంటే మాడిపోతారు
-బీజేపీ దాడుల సంస్కృతికి స్వస్తి చెప్పాలి
-లేకుంటే కిషన్ రెడ్డి, బండి,అరవింద్ ఇండ్ల పై దాడులు చేస్తాం
-మళ్లీ గెలిచేది టీఆర్ ఎస్సే
-పీయూసీ చైర్మైన్ జీవన్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు23:- తెలంగాణ వార్త::
తప్పు చేసినా చేయకున్నా జై మోడీ అంటే వారి జోలికి ఈడీ రాదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.. టీఆర్ ఎస్ ఎల్ పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదని, ఇదంతా బీజేపీ సృష్టించిన అభూత కల్పన అని మండి పడ్డారు. కవితను పోరాటాల వనితగా, ఉమ్మడి పాలకుల హయాంలో మసకబారిన తెలంగాణ సంస్కృతుల కు జీవం పోస్తున్న గొప్ప మహిళగా జీవన్ రెడ్డి అభివర్ణించారు.
ఆమెపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందార్ సిర్సా నిరాధార నిందలు వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజానికి వీరిలో మంజిందర్ సిర్సా పైనే రూ.50లక్ష చీటింగ్ కేసు ఉందని, ఆయనకు లుకౌట్ నోటీస్ కూడా జారీ అయ్యిందని గుర్తు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాముతో కవితకు ఎలాంటి సంబంధం లేదు. అయినా బీజేపీ ఉన్మాదులు నిన్న ఆమె ఇంటిపై రౌడీయిజం చేశారు. దాడులు చేసింది కాక దొంగే దొంగా..దొంగా అని అరిచినట్టు బీజేపీ వాళ్లే పుకార్లు వ్యాపింప చేస్తారు. వాళ్లే దాడులు చేస్తారు. సిగ్గూ ఎగ్గూ లేకుండా వాళ్లే ఈ రోజు నిరసన దీక్షలు చేస్తుండ్రు. యావత్ టీఆర్ ఎస్ పార్టీ కవితక్కకు అండగా ఉంది. మాది 60లక్షల సైన్యం. 95 శాతం మంది ప్రజాప్రతినిధులు టీఆర్ ఎస్ వారే. మేము తిరగబడితే బీజేపీ బతికి బట్ట కడుతుందా?.బీజేపీ దాడుల సంస్కృతిని విడనాడకపోతే మేము కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఇండ్లపై దాడులు చేస్తాం..ఖబడ్దార్” అని జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
కేసీఆర్ ను దేశ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని,
ఇందులో భాగంగానే కవితను టార్గెట్ చేశారని ఆయన మండిపడ్డారు. కవితను టార్గెట్ చేస్తే కేసీఆర్ వెనక్కి తగ్గుతారనే పిచ్చి భ్రమలో ఉన్నారని ఆయన విమర్శిస్తూ కేసీఆర్ మునుగోడు సభలో మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని, బీజేపీ బెదిరింపులకు భయపడనని, ఏం పీక్కుంటారో పీక్కోండి అని సవాల్ విసిరిన సంగతిని గుర్తు చేశారు.
కేసీఆర్ ది ఫైటర్స్ ఫ్యామిలీ అని, 14ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన చరిత్ర కేసీఆర్ కుటుంబానికి ఉందని జీవన్ రెడ్డి అన్నారు. “బీజేపీ రౌడీయిజానికి,మోడీ ఈడీయిజానికి,అమిత్ షా ఐటీయిజానికి తెలంగాణ లో స్థానం లేదు.ఈడీ, ఐటీ, సీబీఐ లు మోడీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయి.అంబానీ, ఆదానీల చేతిలో మోడీ,అమిత్ షా లు తోలుబొమ్మలుగా మారారు. బీజేపీ బాటకు రాని ప్రతిపక్ష నేతలపై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈడీ,ఐటీ,సీబీఐ దాడులు చేయిస్తున్నారు.
బీజేపీ కండువా కప్పుకునే వారిపై కేసులు మాఫీ చేస్తుండ్రు. బీజేపీ కి ఎదురు తిరిగిన వారిని జైళ్లపాలు చేస్తున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, భూపేందర్ సింగ్ హానీ,చరణ్ జిత్ సింగ్ చన్నీ,సత్యేంద్ర జైన్,నవాబ్ మాలిక్,కార్తీ చిదంబరం,సంజయ్ రౌత్, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్ వంటి ప్రముఖులను రాజకీయ కక్షతో ఈడీ, ఐటీ, సీబీఐ ల ద్వారా వేధిస్తున్న నిరంకుశ చరిత్ర బీజేపీది. ఇతర పార్టీల హయాంలో2004 నుంచి 2014 వరకు 112 ఈడీ దాడులు జరిగితే బీజేపీ హయాంలో 2014నుంచి 2022 వరకు 3010 ఈడీ దాడులు జరిగాయి. ఇవన్నీ రాజకీయ కోణంలో జరిగినవే. కొన్ని వేలమందికి నోటీసులు జారీ చేశారు. వారిలో జై మోడీ అన్న వారికి నై ఈడీ అన్నారు. బీజేపీ కండువా కప్పుకుంటే ఆరోజు నుంచి ఈడీ కేసులుండవు. ఇతర పార్టీలను నిలువునా చీల్చి ఊరేగడానికి బీజేపీ ఏర్పాటు చేసుకున్న ఫిరాయింపుల ప్రోత్సాహక కమిటీలోఈడీ ఐటీ, సీబీఐలే సభ్యులు.
బీజేపీలోకి జంపింగ్ లు జనం కోసం కాదు. ధనం కోసమే ఈ డంపింగులు. ఇప్పుడు బీజేపీ తన టక్కు టమారా విద్యలను తెలంగాణ పై ప్రదర్శిస్తున్నది. కానీ
కేసీఆర్ అంటే పవర్. మూడు పేజుల కరెంటు.ముట్టుకుంటే మాడి మసైపోతారు.
ఎవరెన్ని దొంగ నాటకాలు వేసినా మళ్లీ గెలిచేది టీఆర్ ఎస్సే. హ్యాట్రిక్ సాధించడం ఖాయం” అని జీవన్ రెడ్డి పునరుధ్ఘాటించారు.
“ఢిల్లీ నుంచి గల్లీ వరకూ బీజేపీలో కుటుంబ పెత్తనమే సాగుతోంది. కేసీఆర్ ది ఉద్యమ పాలన. ఆయన చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం సాధించిన తెలంగాణ గాంధీ. వార్ హీరో. హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులు ఉద్యమ కారులు. ఈస్ట్,వెస్ట్,నార్త్, సౌత్ నాలుగు దిక్కులూ తిరిగి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వారు ప్రజల ఆశీస్సులతో పదవులు నిర్వహిస్తే తప్పేమిటి?. మోడీ ఒక యాక్టర్, స్టంట్ మాస్టర్. రాష్ట్రానికో వేషం ప్రాంతానికో మోసం. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ గడ్డాలు పెంచడం, రుమాలు చుట్టుకోవడం ఆయనకు తెలిసిన విద్య. ఇచ్చిన హామీలను మర్చి పోయిన మోడీ
ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలేమయ్యాయి. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న16 లక్షల ఉద్యోగ నియామకాలు ఎందుకు జరపడం లేదు?. బీజేపీ అంటే భారతీయ జగడాల పార్టీ.మూఢ నమ్మకాలకు ప్రతీక బీజేపీ.కిల్లర్స్,సెల్లర్స్ పార్టీ. నలుగురు గుజరాతీ బేరగాళ్లు ఇండియాను బిజినెస్ చేశారు. ఇద్దరు అమ్మేటోళ్లు,ఇద్దరు కొనేటోళ్లు .దేశ సంపదను మోడీ, అమిత్ షా లు అమ్ముతుంటే అంబానీ, ఆదానీ కొనుక్కుంటున్నారు.
మేకిన్ ఇండియా ఫేక్ ఇండియాగా, డ్రీమిండియా పూరిండియాగా, టీమిండియా బ్లేమిండియా గా మారడానికి కారణం మోడీ. బీజేపీ రౌడీయిజం,మోడీ ఈడీయిజం, అమిత్ షా ఐటీ రైడ్స్ యిజం ఇవేవీ తెలంగాణ లో సాగవు. తెలంగాణ లో బీజేపీ మాయం కావడమే కాదు కేంద్రం లో కూడా అధికారం పోతుంది.
తెలంగాణ ప్రజలు పట్టుదల, పౌరుషానికి మారుపేరు కాబట్టే పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు.
గుజరాతీ బేరగాళ్ల బెదిరింపులకు లొంగరు. ఏనాడు తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించలేదు”, అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.మాది ఉద్యమ పార్టీ..ఎవరినీ లెక్క చేయం. రాష్ట్ర బీజేపీ నాయకులు గుజరాతీ బేరగాళ్లకు గులాం లుగా మారారు.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోడీ,అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారు.
లేకుంటే రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి బండి సంజయ్ అమిత్ షా బూట్లు, శాలువాలు మోయడం ఏంటి?
బూట్లు ఈస్ సీక్రెట్ ఆఫ్ మై పోస్ట్ అని సంజయ్ నిరూపించుకుండు. రాష్ట్ర బీజేపీ నాయకులను చూసి తెలంగాణ ప్రజలు సిగ్గు పడుతున్నారు. హిట్లర్ లాంటి నియంతలే కుప్పకూలారు. మోడీ ఒక లెక్క కాదు. బీజేపీ రాక్షస పాలన కు చరమ గీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
Leave a comment