కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా
-దేశానికి కేసీఆర్ నాయకత్వం చారిత్రిక అవసరం
-పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి
-పలు కుల సంఘాల ఆధ్వర్యంలో జీవన్ రెడ్డికి సత్కారం
హైదరాబాద్, ఫిబ్రవరి4:-
నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు గా శక్తివంచన లేకుండా పనిచేసి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్ జిల్లా తల్వేద, మారంపల్లి తదితర గ్రామాల అభివృద్ధి కమిటీల ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యాకర్తలు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం జీవన్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పెద్ద ఎత్తున కలిసి శాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకొని జీవన్ రెడ్డికి వారు తమ అభినందనలు తెలిపారు. జై కేసీఆర్, జై జీవనన్న, జై తెలంగాణ,దేశ్ కీ నేత కేసీఆర్ వంటి నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అస్తవ్యస్త పాలనతో గందరగోళం సృష్టిస్తున్న నేపథ్యంలో దేశానికి కేసీఆర్ నాయకత్వం చారిత్రిక అవసరమన్నారు. తనను సత్కరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాని పేర్కొన్నారు. తనను పార్టీ జిల్లా అధ్యక్షుడుగా నియమించిన కేసీఆర్ కు మరో సారి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గా టీఆర్ఎస్ ను బలోపేతం చేయడానికి ఓ వైపు కృషి చేస్తూనే అభివృద్ధిలో ఆర్మూర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని జీవన్ రెడ్డి ప్రకటించారు. ఆర్మూర్ ఆసుపత్రిలో 30 వేల ఉచిత ప్రసవాలు జరిగాయని ఆయన పేర్కొంటూ ఇందు వల్ల ఒక్కో తల్లికి దాదాపు50వేల రూపాయల చొప్పున ఖర్చుల బాధ తప్పిందన్నారు. తల్లి కి 12వేల నగదు,ఆడపిల్ల పుడితే 13వేల రూపాయల చొప్పున నగదు ఇవ్వడమే కాకుండా శిశువు సంరక్షణకు కేసీఆర్ కిట్ అందించినట్టు ఆయన వెల్లడించారు. కాగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 42వేల మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించి వారిని ఆరోగ్య సమస్యలకు దూరం చేయడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు ముంజూరు చేయిస్తానని ఆయన హామీఇచ్చారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి 30 మంది లబ్ధిదారులకు సీ ఎమ్ అర్ ఎఫ్ చెక్కులను అందజేశారు.
Leave a comment