తెలంగాణ వార్త:::సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కాస్త ఉపశమనం లభించింది. పోసాని కృష్ణ మురళికి బెయిల్ లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసాని కృష్ణ మురళికి కడప మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అలాగే పోసాని కృష్ణ మురళిని కస్డడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటీషన్‌ను కడప మొబైల్ కోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు విభేదాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారంటూ జనసేన నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదు మేరకు.. ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోసాని కృష్ణ మురళిని ఫిబ్రవరి నెలాఖర్లో ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరచగా.. కోర్డు 14 రోజుల రిమాండ్ విధించింది.
అయితే పోసాని కృష్ణ మురళిపై ఏపీవ్యాప్తంగా 17 వరకూ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో పోసాని కృష్ణ మురళికి వివిధ ప్రాంతాల పోలీసులు పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిపై పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు తొలుత పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని.. నరసరావుపేట కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఆదోని త్రీటౌన్ పోలీసులు గుంటూరు జైలులో రిమాండ్‌గా ఉన్న పోసానిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కర్నూలు కోర్టుకు తరలించగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు పోసానిని కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారు. ఈ నెల 18 వరకు పోసాని అక్కడ రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు.

Leave a comment