- పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి హర్షం
హైదరాబాద్, తెలంగాణ వార్త:: సెప్టెంబర్,15:-
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సగర్వంగా చాటుకున్నారని ఆయన ప్రశంసించారు. పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరును పెట్టి బిజెపి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని అంబేద్కర్ పొందుపర్చడం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణ పరిపాలనా సముదాయమైన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కెసిఆర్ నిర్ణయించడం తెలంగాణకే గర్వకారణమని ఆయన తెలిపారు.సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఆదర్శమని ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ స్పూర్తితో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయాన్ని తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కెసిఆర్ చేస్తున్న డిమాండ్ ని, తెలంగాణ అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెడితే భారతదేశం ప్రతిష్ట గౌరవం ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టి రాజ్యాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధిని బిజెపి నిరూపించుకోవాలని ఆయన కోరారు. ఈ దిశగా తెలంగాణ బిజెపి నేతలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆశన్నగారి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Leave a comment