నిజామాబాద్(తెలంగాణ వార్త)జూన్ 04: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం విద్యుత్ విజయోత్సవ సభలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. శాసనసభా నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రతి గ్రామం నుండి రైతులు, వివిధ వర్గాల ప్రజలను సమీకరించేలా చర్యలు తీసుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్-కమ్మర్పల్లి మార్గంలో గల లలితా గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగే సభకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విచ్చేయనున్నారు. మిగతా నియోజకవర్గ కేంద్రాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గోనున్నారు. విద్యుత్ రంగంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులు, స్వరాష్ట్రంలో సాధించిన విద్యుత్ విజయాల గురించి వివరించనున్నారు. ముఖ్యంగా వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో సాగు రంగానికి ఉచిత విద్యుత్ రూపేణా చేకూరుస్తున్న లబ్ది గురించి, నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు నూతనంగా నెలకొల్పిన సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఎస్సీ, ఎస్టీలు, నాయి బ్రాహ్మణులు తదితర వర్గాల వారికి అందిస్తున్న ఉచిత కరెంటు, పారిశ్రామిక రంగానికి రాయితీలు తదితర విషయాల గురించి ప్రజలకు వివరించనున్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా విద్యుత్ విజయోత్సవ సభలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
Leave a comment