హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్ (తెలంగాణ వార్త) కోడికూర వండలేదని సోదరుడే చెల్లిని చంపిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కన్నాపురంలో చోటుచేసుకుంది
సి ఐ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయన్ను చూసేందుకు తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో నివసిస్తున్న చెల్లెలు సోమమ్మ(20) వారం కిందటే కన్నాపురం వచ్చారు. రెండురోజుల్లో వస్తానని నంద భార్య పుట్టింటికి వెళ్లారు. నంద గురువారం రాత్రి పదింటికి మద్యం మత్తులో కోడిమాంసం ఇంటికి తీసుకొచ్చాడు. కోడి కూర చేయమనగా, సోమమ్మ నీరసంగా ఉందని చెప్పడంతో గొడవకు దిగాడు. ఇంటికొచ్చేసరికి వండాలని చెప్పి అతడు బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున వచ్చిన నంద కోడికూర వడ్డించాలని కోరగా…. ఆమె వండలేదని చెప్పడంతో దాడికి యత్నించాడు. ఆమె అరుస్తూ బయటకు పరిగెడుతుండగా వెంటాడి గొడ్డలితో నరికాడు. ఆమె కేకలకు చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకునే సరికి సోమమ్మ రక్తపుమడుగులో కొట్టుకుంటూ ప్రాణాలొదిలింది. అతణ్ని గ్రామస్థులు చెట్టుకు కట్టేశారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు.
Leave a comment