అద్భుతంగా ఆర్మూర్ అర్బన్ పార్క్
-ఈ పార్క్ తెలంగాణకే తలమానికం
-నెల రోజుల్లోగా పనులు పూర్తి
-ఆర్మూర్ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు
*ఆయన దయ వల్లే వంద పడకల ఆసుపత్రి
*- “నమస్తే నవనాధపురం* ” కార్యక్రమంలో
-పీయూసీ ఛైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
-పార్క్ నిర్మాణం పనులపై అధికారులతో సమీక్ష
ఆర్మూర్, డిసెంబర్13:- ఎంతో ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం పనులను నెల రోజుల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నామని పీయూసీ ఛైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడించారు. “నమస్తే నవనాధపురం” కార్యక్రమంలో భాగంగా సోమవారం మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గ్రామం వద్ద జరిగిన “నమస్తే ఆర్మూర్ అర్బన్ పార్క్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉదయం 6గంటలకే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అర్బన్ పార్క్ కు చేరుకున్న జీవన్ రెడ్డి పార్క్ మొత్తం కలియ తిరుగుతూ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై పార్క్ నిర్మాణంలో భాగంగా శాఖల వారీగా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు.మిషన్ భగీరథ ప్రాజెక్టు అధికారికి ఫోన్ చేసి పార్క్ లో నీటి సౌకర్యం కల్పించడం కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని కోరారు. పార్క్ కు మిషన్ భగీరథ నీటి కనెక్షన్ ఇచ్చేలా తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారు. అటవీశాఖ ఉన్నతాధికారి ప్రియాంక వర్గీస్ కు ఫోన్ చేసి పార్క్ పెన్షింగ్ కోసం క్యాంపా నిధులు మంజూరు చేయాలని కోరగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పార్క్ నిర్మాణంలో పాలుపంచుకునే అధికారులు, ప్రజా ప్రతినిధులు చరిత్రలో నిలిచిపోతారన్నారు. చేపట్టిన పనులలో విజయం సాధించడం కోసం అంకితభావంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి అధికారులకు ఉద్బోధించారు. సిద్ధులగుట్ట టెంపుల్ కోసం 50వేల ట్రాక్టర్ల మరం పోశామని, కనీవినీ ఎరుగని రీతిలో బ్లాస్టింగ్ లు చేసి గుట్టను కరిగించి సిద్ధులగుట్ట ఆలయానికి ఒక రూపం ఇచ్చామని ఆయన పేర్కొంటూ పార్క్ ప్రాంతంలో ఉన్న శంభుని గుడి అభివృద్ధి కి కూడా అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పార్కులో చేపట్టిన వివిధ పనులకు సంబంధించిన డిజైన్లను అధికారులు ఆయనకు చూపించారు.వాటిని పరిశీలించిన జీవన్ రెడ్డి చాలా బాగున్నాయని, ఈ డిజైన్ల ప్రకారమే ముందుకు పోవాలని కోరారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ పర్యవేక్షణలో ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం జరుగుతున్న దన్నారు.166 హెక్టార్లు అనగా మొత్తం 470 ఎకరాల్లో చేపట్టిన ఈ పార్క్ నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్మూర్ అర్బన్ పార్క్ లో 5.6 కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్ ను నిర్మిస్తున్నామని, ఇప్పటికే మూడు కిలో మీటర్ల వరకూ గ్రీన్ పెన్షింగ్ వేయడం పూర్తయిందని, మిగిలిన 2.6 కిలో మీటర్లకు పెన్షింగ్ వేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ లెటర్ రాసినట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. ఈ పార్కులో రెండు ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తున్నామని, ఏక కాలంలో 500 మంది వినియోగించుకునే సామర్థ్యం ఈ జిమ్ లు కలిగి ఉంటాయన్నారు. పార్క్ కు మంచినీటి సౌకర్యం కలిపిస్తున్నామని, విద్యుత్ లైన్ వేయాలని ఆ శాఖాధికారులను కోరామని, కల్వర్టుల నిర్మాణం పూర్తి కావచ్చిందని జీవన్ రెడ్డి వివరించారు. పార్కు సమీపంలో ఉన్న చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, చెరువులో బోటింగ్ చేసే సౌకర్యం కలిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఇంకా ఈ పార్కు లో గజేబో,ఓపెన్ క్లాస్ రూమ్, పురుషులు, మహిళలకు వేర్వేరు గా వాష్ రూముల నిర్మాణం,5.6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ పొడవునా 46 బెంచిలతో సిట్టింగ్ ఆరెంజ్ మెంట్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 300ఎకరాల అటవీ విస్తీర్ణం స్పష్టంగా కనిపించేలా ఎతైన గుట్టపై 30ఫీట్ల ఎత్తులో వాచ్ టవర్ ను నెలకొల్పుతు న్నామని జీవన్ రెడ్డి వెల్లడించారు. కాగా అద్భుతమైన ఈ ఆర్మూర్ అర్బన్ పార్క్ ను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఆర్మూర్ ప్రజల పాలిట దేవుడని, ఆయన దయతోనే ఆర్మూర్ కు వంద పడకల ఆసుపత్రి వచ్చిందని జీవన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆర్మూర్ అర్బన్ పార్క్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం అని ఆయన అభివర్ణించారు. ఈ పార్క్ నిర్మాణంలో భాగస్వాములు అయిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆయన అభినందించారు. అనంతరం జీవన్ రెడ్డి వారితో కలిసి వాకింగ్ చేస్తూ పార్కు నిర్మాణం పనులు పరిశీలించారు.
Leave a comment