చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం
-జీవన్ రెడ్డి ప్రశ్న కు జవాబిచ్చిన మంత్రి తలసాని
హైదరాబాద్ తెలంగాణ వార్త: రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకానికి ప్రోత్సాహంపై పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం
ఇచ్చారు. అంతకుముందు జీవన్ రెడ్డి ప్రశ్న అడుగుతూ తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం జోరుమీదున్నదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్య రాసులతో పాటు మత్య్స సంపద , గొర్రెల తో గ్రామాలన్నీ కళ కళ లాడుతున్నాయన్నారు. చేపలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఎగుమతి చేసే స్థానానికి ఎదగడం సంతోషకరమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చేపల పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతున్నదో చెప్పాలన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలకు చెరువులు ప్రధాన ఆధారమన్నారు.ఆ చెరువుల్లో కూడా మత్య్స సంపదను పెంచి ముంపు గ్రామాల వారికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు. దీనిపై మంత్రి శ్రీనివాసయాదవ్ సమాధానమిస్తూ
చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చేపలను, రొయ్యలను భారీ ఎత్తున పెంచుతున్నామని పేర్కొన్నారు. మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు.సమైక్య ఆంధ్రలో మత్స్యకారులను పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను మరిచిపోయాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అన్ని కులాలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు. దీంతో ఇప్పుడు చేపల ఎగుమతిలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు. చేపలతో పాటు రొయ్యల పెంపకాన్ని కూడా చేపట్టామన్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 150 మొబైల్ వెహికల్స్‌ను మత్స్యకారులకు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు
Leave a comment