పాఠశాలలను సందర్శించిన కలెక్టర
పనులను నాణ్యతతో జరిపించాలని అధికారులకు ఆదేశం
నిజామాబాద్, (తెలంగాణ వార్త) మార్చి 17 : జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, అర్సపల్లి లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం సందర్శించారు. మన ఊరు – మన బడి/ మన బస్తీ – మన బడి కార్యక్రమం మొదటి విడత కింద ఎంపికైన వాటిలో ఈ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పై రెండు బడులను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి పాఠశాలల్లో నెలకొని ఉన్న స్థితిగతులను పరిశీలించారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు వీలుగా ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన పనుల ప్రతిపాదనలు, అంచనా విలువలను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా, నాణ్యతతో పనులు జరిపించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలోనూ నీటి వసతితో కూడిన టాయిలెట్స్ అందుబాటులో ఉండాలని, విద్యుద్దీకరణ పనులు చేపడుతూ, ప్రతి తరగతి గదిలో విద్యార్థుల సౌకర్యార్ధం సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పైకప్పు లీకేజీలకు మరమ్మతులు చేయాలని, నీటిని నిలువ చేసుకునేందుకు వీలుగా సంప్ నిర్మించాలని సూచించారు. ప్రధానంగా పాఠశాల ఆవరణలో మురుగు నీరు, వర్షపు జలాలు నిలువ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను పక్కాగా ఏర్పాటు చేయించాలన్నారు. ఏ పని చేసినా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా సరైన ప్రణాళికతో పనులు జరిపించాలన్నారు. పాఠశాలల ఆవరణ అందంగా, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బడులలో నెలకొని ఉన్న సమస్యల గురించి ప్రధానోపాధ్యాయులు సిరాజ్ ముజాహిద్, సాజిదా పర్వీన్ లు కలెక్టర్ దృష్టికి తేగా, వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నాగారం పాఠశాల ఉపాధ్యాయుల బృందం కలెక్టర్ ను సన్మానించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్, సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ దేవిదాస్ రావు, ఏ.ఈ ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది
Leave a comment