Home హాట్ న్యూస్ డ్రోన్ స్ప్రేయర్ల పనితీరుపై మరింత లోతుగా అధ్యయనం ఆయా కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ భేటీ.
హాట్ న్యూస్

డ్రోన్ స్ప్రేయర్ల పనితీరుపై మరింత లోతుగా అధ్యయనం ఆయా కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ భేటీ.

నిజామాబాద్, మార్చి 19 : డ్రోన్ స్ప్రేయర్ల పనితీరుపై మరింత లోతుగా అధ్యయనం చేసి, వాటి ఫలితాలను కూలంకషంగా
పరిశీలన జరిపిన తరువాతనే ఈ యూనిట్ల స్థాపన కోసం ముందుకెళ్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. దళిత కుటుంబాలను ఆర్థికంగా అభ్యున్నతి బాటలో పయనింపజేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం అమలు చేస్తున్న విషయం విధితమే. ఈ పథకం మొదటి విడతలో ఎంపికైన లబ్దిదారులచే వ్యవసాయ పంటలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ స్ప్రేయర్ల ద్వారా పిచికారీ మందు చల్లే యూనిట్లను స్థాపింపజేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపుతోంది. ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రయోగాత్మకంగా డ్రోన్ స్ప్రేయర్ పనితీరును పరిశీలించిన మీదట, ఆయా నియోజకవర్గాల లబ్ధిదారులతో ముఖాముఖి సందర్భంగా వీటి గురించి ప్రస్తావించడం జరిగింది. దీంతో ఫోర్ వీలర్ వాహనాలు ఎంపిక చేసుకున్న అనేక మంది లబ్ధిదారులు వాటి స్థానంలో డ్రోన్ స్ప్రేయర్ యూనిట్ల స్థాపనకు సంసిద్ధత తెలిపారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ శనివారం తన ఛాంబర్లో డ్రోన్ స్ప్రేయర్ల అమ్మకాలు జరుపుతున్న ఆయా కంపెనీల ప్రతినిధులతో పాటు, జిల్లాలో ఇప్పటికే వీటిని ఉపయోగిస్తున్న పలువురు రైతులు, వ్యాపారులతో సమావేశమై అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. యూనిట్ల స్థాపనకు ఎంత వ్యయం అవుతుంది, నిర్వహణ ఎలా ఉంటుంది, లాభ నష్టాల పరిస్థితి ఏమిటి, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ఎలా పరిష్కరిస్తారు, డ్రోన్ స్ప్రేయర్ల వినియోగానికి అవసరమైన శిక్షణ, కావాల్సిన అనుమతులు ఎక్కడి నుండి పొందాలి, వీటి మన్నిక ఎంత కాలం పాటు ఉంటుంది తదితర విషయాల గురించి వివిధ కంపెనీల ప్రతినిధులు కలెక్టర్ కు వివరించారు. ప్రధానంగా డ్రోన్ స్ప్రేయర్ల పనితీరులో కీలక పాత్ర పోషించే బ్యాటరీల ఎంపిక ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే వీటిని వినియోగిస్తున్న తానాకుర్దుకు చెందిన లింబారెడ్డి, మోర్తాడ్ మండలం దొన్ పాల్ కు చెందిన భాస్కర్ తదితరులు కూడా తమ అనుభవాలను వివరించారు. డ్రోన్ల పనితీరు బాగానే ఉన్నప్పటికీ, బ్యాటరీలను ఎంతో జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుందన్నారు. మొత్తం మీద చూస్తే డ్రోన్ స్ప్రేయర్ల ద్వారా పిచికారీ మందు చెల్లించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని, వీటికి మంచి డిమాండ్ ఉందని, దీంతో తాము లాభాలు సాధిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ కూలీల అవసరం లేకుండా, తక్కువ మోతాదులో ఎరువులు, క్రిమిసంహారక మందులతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలకు పిచికారీ చేసే వెసులుబాటు ఉన్నందున రైతులకు కూడా మిగులుబాటు అవుతోందన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ, దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లోనూ లాభాల బాటలోనే పయనిస్తూ ఆర్ధిక సుస్థిరతను సాధించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అయినందున, డ్రోన్ స్ప్రేయర్ల పనితీరు పై మరింత విస్తృతంగా పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లబ్దిదారులచే ఈ యూనిట్లను ఏర్పాటు చేయించిన తరువాత ఈ చిన్న కారణం వల్లనైనా వారు ఆశించిన రీతిలో లాభాలు పొందలేకపోతే దళిత బంధు లక్ష్యానికి విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంటుందన్నారు. అందువల్ల ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరిపి, పూర్తి స్థాయిలో సంతృప్తి చెందిన మీదటే లబ్దిదారులచే వీటి స్థాపన కోసం ముందుకెళ్తామని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలన జరిపి సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె.గోవింద్, కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ నవీన్ లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్దీవో రవి, బ్లూబొట్ రోబోటిక్స్, మోడల్ డ్రోన్స్, ఆరిస్ సొల్యూషన్స్, త్రిశూల కాంపోనెంట్స్ తదితర డ్రోన్ స్ప్రేయర్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page