తెలంగాణ వార్త:::అని రంగాల్లో మహిళలకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. పెట్రోల్ పంపులు, ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. అదానీ అంబానీలకు ఫలితమైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఆడబిడ్డలకు అందిస్తున్నామని ఉద్ఘాటించారు. త్వరలో మరిన్ని వ్యాపారాల్లోకి మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ(శుక్రవారం) యూసఫ్ గూడా లోని నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో , స్మాల్, మీడియం ఎంటర్‌ప్రెజెస్ ప్రాంగణంలో మహిళా సాధికారత యాక్షన్ ప్లాన్ వర్క్ షాప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, విద్యార్థులు, సిబ్బంది, సెర్ప్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, ఏపీఎంలు హాజరయ్యారు. ప్రగతికి చిహ్నంగా మొక్కలకు నీరు పోసి వర్క్ షాప్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. పారిశ్రామిక రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన పలువురు ప్రముఖులను మంత్రి సీతక్క సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు.
మహిళలకు సమాన అవకాశాలు..
‘అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు సమాన వేతనాలు ఉండాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.మహిళల కష్టానికి తగిన ఫలితం ఉండాలన్నదే మహిళా దినోత్సవ ఆవిర్భావానికి కారణంగా నిలిచింది. భూగర్భం నుంచి అంతరిక్ష రంగం వరకు అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు రావాలి. మహిళల కష్టానికి తగిన ఫలితం దక్కినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం. మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగిన వివక్షత కొనసాగుతూనే ఉంది. మహిళలు ఎమ్మెల్యేలు మంత్రులు ఐఏఎస్‌లు అయినా లైంగిక అసమానతలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒకప్పుడు మహిళలకు వ్యవసాయం, పరిశ్రమలు మాత్రమే ఉపాధి మార్గాలు.కానీ ఇప్పుడు ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. అయినప్పటికీ మహిళల పట్ల సమాజంలో చిన్న చూపు పోవడం లేదు.ప్రతి రంగంలో మహిళల ప్రస్థానాన్ని, వారి స్థానాన్ని సమీక్షించాలి. లింగ సమానత్వం విషయంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంత మేర మనం చేరుకోగలుగుతున్నామో ఆవలోకనం చేసుకోవాలి. మహిళలకు సమానత్వం, సమాన అవకాశాలు రావాలి. లింగ అంతరాలను తుంచితినే సమాజంలో సమానత్వం. శారీరకంగా మహిళలకు ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయి.వాటన్నిటినీ అధిగమించి మహిళలు మందంజ వేస్తున్నారు. మహిళల ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని విధానాల రూపకల్పన జరగాలి’ అని మంత్రి సీతక్క తెలిపారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలు..
‘ఆదిశలో ప్రజా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. మహిళా అనుకూలంగా అత్యుత్తమ విధానాన్ని రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. అనుభవజ్ఞులంతా సలహాలు సూచనలు చేస్తే, అనుగుణంగా నూతన విధానాన్ని రూపొందిస్తాం. లింగ సమానత్వాన్ని సాధించడంలో మహిళా సంఘాల పాత్ర గణనీయంగా ఉంది. మహిళా సంఘాలు మహిళలకు ఆర్థిక రక్షణతో పాటు సామాజిక భద్రత కల్పిస్తున్నాయి. ఈ ఏడాది అనుకున్న లక్ష్యాలకు మించి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించాం. రూ. 20వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకుంటే.. రూ.22 వేల కోట్ల వరకు రుణ సౌకర్యం కల్పించాం. మహిళా తన కాళ్ల మీద తాను నిలబడాలి, రాజకీయ రంగంతోపాటు అన్ని రంగాల్లో బలమైన శక్తిగా ఎదగాలి.రాజ్యాలు సొంతగా పాలన చేసేలా మహిళలు ఎదగాలి. మహిళలే అసలు సిసలు ఆర్థిక శాస్త్రవేత్తలు. పుస్తకాల ఆర్థిక శాస్త్రవేత్తలు ఎందరో ఉంటారు.. కానీ ఆచరణలో, కుటుంబ నిర్వహణలో మహిళలే అత్యున్నత ఆర్థికవేత్తలు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో అతివలు అపూర్వ విజయాలు సాధిస్తున్నారు. మహిళా అభివృద్ధితోనే సమాజం ప్రగతి సాధిస్తుంది. వచ్చే మహిళా దినోత్సవం లోపు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రెండు మెట్లు ఎదిగేలా కృషిచేస్తాం’’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Leave a comment