29-09-2022 రంగారెడ్డి జిల్లా, తెలంగాణ వార్త:
మహిళలందరూ ఆనందంగా అత్యంత వైభవోపేతంగా జరుపుకునే పండుగ అని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.
గురువారం సమీకృత కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియలతో కలిసి పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆనందాలను, ఆప్యాయతలను పంచడమే కాకుండా బతుకమ్మ పండుగ విలువలకు అద్దం పడుతుందని అన్నారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే ఆచారం సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ఈ పండుగను మహిళలు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారని, మహిళా స్వావలంబన చెందాలనే గొప్ప ఆశయం బతుకమ్మ సంబరాలలో ఉందనీ, బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు కలెక్టర్ తెలిపారు.
అనంతరం ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్బంగా కలెక్టర్ అమోయ్ కుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Leave a comment