రంగారెడ్డి, తెలంగాణ వార్త: ఆగస్టు 11 : సహోదర భావానికి ప్రతీక అయిన రక్షా బంధన్ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ అమోయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ రాఖీ పండగను సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం ఈ పండుగ విశిష్టత అని పేర్కొన్నారు. అక్కా, చెల్లెళ్ళ రక్ష తమ గురుతర బాధ్యత అనే కర్తవ్యాన్ని రక్షాబంధన్ గుర్తు చేస్తుందన్నారు. సోదరభావంతో, ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే ఈ వేడుక భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటుతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న ప్రస్తుత శుభ తరుణంలో రక్షాబంధన్ వేడుక రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని, ఇది ఎంతో శుభ పరిణామం అని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న రక్షా బంధన్ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై జాతీయ స్ఫూర్తిని చాటాలని, రాఖీ పౌర్ణమి వేడుక ప్రజల నడుమ సహోదర భావాన్ని మరింతగా పెంపొందించాలని ఆకాంక్షించారు.
Leave a comment