హైదరాబాద్, తెలంగాణ వార్త :: ఎస్ఎస్ఆర్-2025లో భాగంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కట్టుదిట్టంగా చేపడుతూ నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు.
మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ సమ్మరీ రివిజన్, ఈ.ఆర్.ఓ నెట్ 2.0 తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీ.ఈ.ఓ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణలో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియ వేగవంతమయ్యిందని, వారం రోజుల వ్యవధిలోనే 55 శాతం నుండి 95 శాతానికి చేరుకుందని జిల్లా కలెక్టర్లు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, సూపర్వైజర్లను అభినందించారు. అయితే మరో ఐదు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నందున గడువులోపు ఇంటింటి సర్వేను అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, సూపర్వైజర్లు తప్పనిసరిగా ప్రతి ఇంటిని, తమ పరిధి లోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని తప్పక సందర్శించాలని, తద్వారా ఓటరు జాబితాలో ఎలాంటి సాంకేతిక తప్పిదాలు చోటు చేసుకునేందుకు అవకాశం ఉండదని అన్నారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ ప్రక్రియను ఓటరు ముసాయిదా జాబితా వెలువరించడానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రం కొనసాగుతున్న ప్రదేశాన్ని తెలియజేసేలా ఫోటోలను బి.ఎల్.ఓ యాప్ లో అప్ లోడ్ చేయాలని అన్నారు.
అదేవిధంగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫారం 6, ఫారం 6 ఏ, ఫారం 7, ఫారం 8 దరఖాస్తులను త్వరితగతిన పరిశీలన జరపాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు అన్ని పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిన వారి వివరాలు క్షేత్ర స్థాయిలో సేకరించి, ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా నోటీసు జారీ చేసిన మీదట అలాంటి వారి పేర్లను జాబితా నుండి తొలగించాలని తెలిపారు. డెమోగ్రాఫికల్ సిమిలారిటీలు కలిగిన వాటిని జాబితా నుండి తొలగించేందుకు ఇంటింటి సర్వే కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని, దీనివల్ల ఎన్నికల సమయంలో హడావుడి పడాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఇంటింటి సర్వే లో ఆధార్ నెంబర్ సేకరణ తప్పనిసరి కాదని, ఓటర్లు ఇష్టం ఉంటే ఇవ్వవచ్చని, బలవంతం చేయరాదని అన్నారు. ఇంటింటి సర్వే సంబంధించి వచ్చిన నూతన ఓటర్ నమోదు దరఖాస్తుల వివరాలు, ఎస్ఎస్ఆర్ -2025 తో ముడిపడిన అంశాలను ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని అన్నారు. వారితో సమావేశాలు నిర్వహించే సందర్భంగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాల్సిందిగా నోటీసుల ద్వారా కోరాలని సీఈఓ సూచించారు. కొత్త ఓటరు కార్డుల ముద్రణకు సంబంధించిన వివరాలను సకాలంలో సమర్పించాలని అన్నారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు కోసం పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్లకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎన్నికల విభాగం అధికారి నాగార్జున, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మోహన్ దోండి 9440023558
Leave a comment