రూ.కోటి విలువైన గంజాయిని పట్టుకున్న ఉప్పల్ ఎక్సైజ్, ప్రొబిషన్ అధికారులు
- ముగ్గురు అరెస్ట్, నల్గురు పరార్
- కారు, డీసీఎం స్వాధీనం
ఉప్పల్, తెలంగాణ వార్త ప్రతినిధి:
ఉప్పల్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి కోటి రూపాయల 434 కిలోల విలువైన డ్రై గంజాయిని పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు పట్టుబడగా నలుగురు పరారీలో ఉన్నారు.
ఉప్పల్ బాగాయత్ మంగళవారం ఉప్పల్ ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ టి. డేవీ రవికాంత్, మల్కాజిగిరి డీసీపీవో డి.అరుణ్ కుమార్, ఎస్. ఎస్ హెచ్ ఓ ఎస్ చంద్రశేఖర్ గౌడ్ వివరాలను వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ అరుకు ప్రాంతం నుండి డీసీఎం లో హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతానికి తీసుకొచ్చి డీసీఎం నుండి కారులోకి గంజాయిని షిఫ్ట్ చేసి, ఉప్పల్ నుండి కారులో మహారాష్ట్రకు తరలించే క్రమంలో పట్టుబడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తూర్పు పాలకుల ప్రాంతానికి చెందిన చిన్న పేరుపురెడ్డి అర్జున్ (25) గోదావరిఖనికి చెందిన నేరెళ్ల కిరణ్ కుమార్(20) హైదరాబాద్ కు చెందిన సయ్యద్ తాహెర్ లు డీసీఎం లో నుంచి గంజాయిని కారులోకి మారుస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముఠాలోని సభ్యులు పేరుపురెడ్డి వీరేంద్ర కుమార్, సందీప్, తేజ, ఫజల్, మరొకరు పరారీలో ఉన్నారు.216 డ్రై గంజాయి ప్యాకెట్లు,27 ప్లాస్టిక్ క్యాన్లలో 440 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని వారు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Leave a comment