నిజామాబాద్ ప్రతినిధి, తెలంగాణ వార్త: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్రోహుల ఉనికి కలకలం రేపింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన కీలక నాయకుడిని, మరో ఇద్దరు సభ్యులను ఇక్కడి పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్ పోలీస్ కమి షనర్ నాగరాజు బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. పీఎఫ్ఐ సంస్థ నిజామాబాద్‌లో సుమారు 200 మందికి దేశ వ్యతిరేక భావజాలంపై శిక్షణ ఇచ్చినట్టుగా గుర్తించామని తెలిపారు.
సంస్థ శిక్షకుడు అయిన జగిత్యాల వాసి అబ్దుల్ ఖాదర్‌ను ఈ నెల 4న అరెస్టు చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఖాదర్ సమాచారం మేరకు నిజామాబాద్ నగరానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అబ్దుల్ మొబిన్‌తోపాటు ఇక్కడి గుండారం గ్రామానికి చెందిన షేక్ సాదుల్లాను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
ఖాదర్ అరెస్టవడంతో..
పీఎఫ్ఐ శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ అరెస్టవడంతో ఏం చేయాలన్న దానిపై మాట్లాడుకునేందుకు సాదుల్లా, ఇమ్రాన్, అబ్దుల్ మోబిన్ ఈ నెల 5న గుండారం గ్రామంలో కలిశారని.. ఆ సమయంలో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని పోలీసు బృందం వారిని అదుపులోకి తీసుకుందని సీపీ వివరించారు. సాదుల్లా 2017లో పీఎఫ్ఐలో చేరి.. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో క్రియాశీల సభ్యుడిగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. పీఎఫ్ఐ శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ గతంలో గల్ఫ్‌కు వెళ్లి వచ్చి నిజామాబాద్‌లో నివాసం ఉంటున్నాడని వివరించారు. పీఎఫ్ఐ కీలక నేతలు ఖాదర్‌కు ఇంటి నిర్మాణం కోసం రూ.6 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి, ఆ సంస్థ సభ్యులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడం కోసం సంస్థలో చేర్చుకున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఖాదర్ వరంగల్‌లో, పలు ఇతర ప్రాంతాల్లో యువకులకు శిక్షణ ఇచ్చాడని గుర్తించామన్నారు. గత ఆరు నెలలుగా ఖాదర్ నిజామాబాద్‌లోనే ఉంటూ తన ఇంటిపైనే పీఎఫ్ఐ కార్యకలాపాలపై శిక్షణ ఇస్తున్నాడని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో ఇలా శిక్షణ తీసుకున్న 200 మందిలో 23 మంది కీలక వ్యక్తులు ఉన్నట్టు గుర్తించామన్నారు. మిగతా వారిని సైతం అరెస్టు చేస్తామన్నారు. ‘సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా)’ ఉగ్రవాద సంస్థను నిషేధించిన తర్వాత అందులోని కొందరు కీలక వ్యక్తులు పీఎఫ్ఐని స్థాపించారని గుర్తు చేశారు.
కడపలో బేస్ క్యాంపు పెట్టుకుని..
పీఎఫ్ఐ ఏపీలోని కడపలో బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకుని కార్యకలపాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలిందని సీపీ చెప్పారు. చురుకైన యువకులను ఎంపిక చేసుకుని ఇతర మతాలపై వ్యతిరేక భావజాలం ప్రేరేపిస్తున్నారని వివరించారు. నిజామాబాద్‌లో 2 నెలల్లో లీగల్ వర్క్‌షాప్, ఫిజికల్ ట్రైనింగ్ క్యాంప్ తదితర కార్యక్రమాలు నిర్వహించినట్టు తేలిందని చెప్పారు. వీరికి భైంసా అల్లర్లు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో చేసిన అలర్లతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నామని తెలిపారు. విచారణలో అరెస్టైన ముగ్గురూ ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించ లేదని తెలిపారు.
విదేశాల నుంచి విరాళాలు
నిజామాబాద్ నడిబొడ్డున ఆటోనగర్ కేంద్రంగా 200 మంది యువకులకు పీఎఫ్ఐ శిక్షణ ఇచ్చిన ఘటన కలకలం సృష్టించింది. రాష్ట్రంలోని భైంసా, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ యువకులతోపాటు ఏపీలోని ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకు చెందినవారు ఇక్కడ శిక్షణ తీసుకున్నట్టు సమాచారం. ఈ శిక్షణకు విదేశాల నుంచి భారీగా విరాళాలు వచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. పీఎఫ్ఐ సభ్యుల వద్ద మారణాయుధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
Leave a comment