హైదరాబాద్, తెలంగాణ వార్త:: తెలంగాణపై వరుణుడు పగ బట్టినట్లు ఉన్నారు. అదే పనిగా ప్రతాపం చూపిస్తూ అతలాకుతలం చేస్తున్నాడు. ఇటీవల వారం రోజుల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాలకు రాష్ట్రమంతా వరద పోటెత్తింది.
వందలాది గ్రామాలను ముంచెత్తింది. లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జూలై నెలలోనే గోదావరి మహోగ్రరూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్ని ప్రస్తుతం నిండుకుండలా ఉన్నాయి. వరదల ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే మరోసారి వరద గండం ముంచుకొస్తోంది. తెలంగాణకు తాజాగా మరోసారి హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.
తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 7న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు రుతుపవణ ద్రోణి వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా ఈనెల 9వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Leave a comment